దక్షిణాది రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన  దివ్యఫలకము (#13725)

[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పదహారు దక్షిణాది రాష్ట్రాలు: డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరోలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియానా, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ నివాసులైన బహాయిల నుద్దేశించి 1916 సం. మార్చి 27న బహాఉల్లా దివ్యసమాధికి చేరువనున్న ఉద్యానవనంలో దీనిని వెలువరించడం జరిగింది.] 
 
ఓ భగవత్సామ్రాజ్య దూతలారా! 
కొన్ని దినములకు పూర్వ మాభగవద్విశ్వాసుల కొక ఉపదేశమును వ్రాయనైనది, అయితే, ఇవి నౌరూజ్ పర్వదినము లైనందున, మీరు నాకు జ్ఞప్తికి వచ్చినారు; ఈ వైభవప్రపూరిత విందు సందర్భమున మీకు ఈ అభినందనలను పంపుతున్నాను. దినములన్నయూ ధన్యత నొందినవే, కానీ, పర్షియాకు ఈ విందు - జాతీయ పర్వ దినము. దీనిని పర్షియనులు గత వేలాది వత్సరములుగా జరుపుకుంటూ వస్తున్నారు. వాస్తవమునకు - భగవత్స్మరణమున, భగవత్పరిమళ పరివ్యాపనమున, భగవత్సామ్రాజ్యమునకు ప్రజల నాహ్వానించుట యందున తాను గడుపునట్టి ప్రతి రోజూ మానవునకు పర్వదినమే. మీరు భగవత్సామ్రాజ్య సేవలో నిమగ్నులై, భగవన్మత సముద్ఘోషణ మందున నిరతులై ఉన్నందులకు భగవంతునకు ప్రస్తుతి. కనుక, మీ వన్నియూ పర్వదినములే. భగవంతుని సహకారానుగ్రహములు మీపై వర్షించు ననుటకు సంశయము లేదు. 
యునైటెడ్ స్టేట్స్ లోని దక్షిణాది రాష్ట్రాలైన -- డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరోలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియానా, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ లకు చెందిన మిత్రులు కొందరే. కనుక, ఆయా రాష్ట్రములకు స్వయముగా మీరే వెళ్లడమో, పలువురు ధన్యజీవులను పంపించడడమో చేసిన పక్షంలో, వారు - ప్రజలను దివ్యసామ్రాజ్యము నాశ్రయించేలా పథనినిర్దేము గావింపగలరు. పవిత్ర దివ్యావతారమూర్తులయం దొకరు ఒక విశ్వాసిని ఉద్దేశించి, ఒక వ్యక్తి ఒక ఆత్మచైతన్యమునకు కారణభూతు డైనచో — అది అనంతైశ్వర్యమున కన్ననూ మిన్నయని చెప్పనైనది. “ఓ ఆలీ! భగవంతుడు నీ ద్వారా ఒక్కనికి మార్గదర్శన మొనరించెనేని, సమస్త సంపదల కన్ననూ సర్వోత్తమ మది.” ఇంకా, ఇలా అంటున్నా డాయన: “మమ్ము ఋజుపథమునకు నిర్దేశింపుము.”1 అనగా, మాకు సరియైన దారిని చూపమని. “మీరు ప్రపంచము నందలి ప్రాంతము లన్నింటికీ పయనించి, దేవుని రాజ్యావతరణ శుభసమాచారమును వెల్లడింపు,”2  డని సువార్తలో సైతము ప్రస్తావితమైనది.
సంక్షిప్తముగా, మీరీ విషయమున బృహద్యత్న మొనరించి, వదాన్యతను ప్రదర్శింతురని భావింతును. మీరు తోడ్పాటునొంది, అనుగ్రహీతులు కాగలరనునది సునిశ్చయము. దివ్యసామ్రాజ్యపు టధివాస్తవికల, ప్రాధాన్యతల ప్రత్యక్షతా శుభవర్తమానమును ప్రకటించు నాతడు, సారవంతమైన భూమిలో స్వచ్ఛబీజములను చల్లు కర్షకుని వంటి వాడే. వాటిపై వసంతమేఘ మనుగ్రహవర్షమును కురియించును; ఇక, కర్షకుని స్థాయి గ్రామాధిపతి దృష్టిలో సమున్నతమై, పంట దిగుబడు లెన్నియో సమకూడుతవి. 
కనుక, ఓ భగవన్మిత్రులారా! దివ్యాశీస్సులనూ, దేవదేవుని అనుగ్రహమునూ అందుకొనుటకై, మీరు ఈ సమయపు విలువను దెలిసికొని, బీజములను చల్లుటలో నిమగ్నులు కండు. 
బహాఉల్-ఆభా మీతో నున్నాడు!

-`Abdu'l-Bahá
-----------------------

దక్షిణాది రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన  దివ్యఫలకము (#13731)

[యునైటెడ్ స్టేట్స్ లోని పదహారు దక్షిణాది రాష్ట్రాలు: డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరొలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియాన, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ నివాసులైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 3న హైఫాలో, ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.] 
 
ఓ ధన్యజీవులారా, మాన్యులారా! 
 
జనుల నివాసమున కత్యంత సముచితస్థలము సమశీతోష్ణమండలము, ఎందులకనగా, పరిపక్వతాపరముగా ఈ ప్రాంతమున మేధాశక్తులూ, మనోభావములూ ఉదాత్తస్థితి నొందుతాయి, నాగరికతా సంబంధిత ప్రతిభా పాటవములు పరిపూర్ణ స్థాయిలో వికసిస్తాయి - అను వాస్తవమును ప్రాచీన తత్త్వవేత్తలూ, మధ్యయుగ మేధావులూ, ప్రస్తుత, పూర్వశతాబ్దుల శాస్త్రజ్ఞులూ - సర్వులూ సమ్మతించినారు. మీరు విమర్శనాపూర్వకముగా, సునిశితదృష్టితో చరిత్రాధ్యయన మొనరించినప్పుడు, ప్రముఖులయందలి పలువురు - సమశీతోష్ణమండలమున జన్మించి, వృద్ధిలోనికి వచ్చి తమ కృషిని కొనసాగించిన వారేననీ, అత్యుష్ణ, అతిశీతలమండలవాసులు బహు కొద్దిమందేననీ స్పష్టమౌతున్నది. 
ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లోని ఈ పదహారు దక్షిణాది రాష్ట్రములూ సమశీతోష్ణ మండలస్థితములే. ఈ ప్రాంతమున ప్రాకృతికప్రపంచ పరిపూర్ణతలు సర్వసమగ్రముగా వెల్లడియైనవి. ఎందులకనగా, పర్యావరణ సమతుల్యతా, ప్రకృతి సౌందర్యమూ, గ్రామసీమల భౌగోళిక విన్యాసమూ  మేధస్సులలోనూ, మనోభావముల యందునా మహత్తర ప్రభావమును ప్రదర్శిస్తాయి. పరిశీలనాత్మకముగ, అనుభవపూర్వకముగ, ప్రస్ఫుటముగ వెల్లడియైన వాస్తవమిది.
పవిత్ర దివ్యావతారమూర్తులు సైతము, అత్యంత సమతులన స్వభావులై  యుండెడివారు; వారి శరీరారోగ్యమూ, సర్వసమగ్రతా అత్యంత పరిపూర్ణములై, వారి భౌతికతత్త్వములు దేహదార్ఢ్యతాయుతములై, వారి శక్తులు నిర్దిష్టసరళీ సమన్వితములై, వారి బాహ్యస్పందనలు అంతర్లీన గ్రహణశక్త్యనుసంధానితములై, అసాధారణ శీఘ్రతాయుతములై, సమన్వయ ప్రపూరితములై  యుండెడివి. 
అందువలన, ఈ పదహారు రాష్ట్రాలలోనూ- వాటి వాతావరణము అత్యంత సమతులనయుతము కనుక, నిస్సందేహముగా దివ్యబోధనలు సముజ్జ్వలప్రభతో ఆవిష్కృతములు కావలె, పవిత్రాత్మనిశ్వాసములు మహోధృతిని ప్రదర్శింపవలె, ఉత్తుంగతరంగములతో భగవద్వాత్సల్యసాగర ముప్పొంగవలె, దివ్యానురాగమను ఉపవన మలయపవనములు మహోధృతవేగమున వీయవలె, పవిత్రతాసౌరభములు సత్వరమే శీఘ్రగతిన పరివ్యాప్తములు కావలె.  
భగవంతునికి ప్రస్తుతి, దివ్యప్రవాహము లనంతములై, ఉదాత్తసూత్ర మధురిమ పరమప్రభావశీలమై, మహత్తరకక్ష్య పరిపూర్ణశోభా ప్రభాసితమగుచూ, సర్వోత్కృష్టగణ సైనికదళములు అప్రతిహతశక్తితో ముట్టడిస్తుండగా, జిహ్వలు ఖడ్గముల కన్నను నిశితములై, హృదయములు విద్యుత్కాంతి కన్నను తేజోభరితములై, మిత్రుల యౌదార్యము పూర్వాపర తరముల వదాన్యతల నధిగమిస్తుండగా - ఆత్మలు దైవసంకల్ప సమాకర్షితములై - భగవంతుని ప్రేమాగ్ని ప్రజ్జ్వలితమైనది.   
ఈ సమయాన, ఈ సందర్భాన, మన మీమహదవకాశమును తప్పక వినియోగించుకొనవలె. క్షణమేని స్తబ్ధులము కారాదు; స్థిమితము, విశ్రామము, ప్రశాంతత, వస్తుజాలము, జీవితము, ప్రాపంచిక విషయవ్యామోహముల నుండి బంధవిముక్తులము కావలె. పరమోన్నతుడైన జీవాధినాధునికై సమస్తమును త్యాగము సేయవలె, తద్వారా దివ్యసామ్రాజ్యశక్తులు మహత్తర బుద్ధిసూక్ష్మతలను ప్రదర్శిత మొనరింప, ఈ నవీనావృత్తస్థిత తేజోభాసము - మేధో, లక్ష్య ప్రపంచములను శోభిల్లజేయ వచ్చును. 
అమెరికాలో దైవసౌరభములు పరివ్యాప్తములై దరిదాపుగా ఇరువదిమూడు వత్సరములైనది, కాని సముచిత, సయుక్తస్పందన సాధింపబడలేదు, మహత్తర ప్రశంసా, వేగాధిక్యతా అగుపించలేదు. ఇప్పుడిక దైవశక్తితో, దయాన్వితుని పరిమళములతో, చైతన్యాకర్షణముతో అలౌకిక వర్షధారలతో, దైవసేనాదళములతో, భగవద్వాత్సల్య ప్రస్రవణపు వెల్లువతో, భగవద్విశ్వాసు లుద్యమింతురని, మహాశుభము అనతి కాలమునకే తన ముసువును తొలగించునని, ప్రాకృతిక ప్రపంచాంధకారము సంపూర్ణముగ పటాపంచలై, పారద్రోలబడునంతటి తీక్ష్ణతతో సత్యసూర్యుడు ప్రకాశించునని;  సకల దిశలనుండియు మహాద్భుత మధురగీతిక వెలువడునని, మానవాళి సచేతనయై, పురోగమించునటుల, ఘనపదార్థములు ద్రవీభవించునటుల, వజ్ర కఠినులు తమ రెక్కలను విప్పార్చుకుని భగవంతుని అనురాగోష్ణిమలో స్వర్గసీమ దెస కెగయునటుల - ప్రాతఃకాల విహంగములు గళములనెత్తి గానము సేయునని నా యాశ.   
రమారమి రెండువేల వత్సరములకు పూర్వము ఆర్మీనియా నిబిడాంధకార సమావృతమై యుండెడిది. క్రీస్తు శిష్యులయందలి ధన్యజీవి యొక్కడు, సత్వరమే తరలినా డాప్రాంతమునకు; ఆతడి కృషితో అచిరకాలమునకే ఆ దేశము చైతన్య ప్రపూరితమైనది. ఆ విధముగ దివ్యసామ్రాజ్యశక్తి క్రియాశీలకత ప్రస్ఫుటమైనది.  
కనుక, దయామయుని ఆశీస్సులూ, మహోన్నతుని సాహాయ్యమూ సునిశ్చితములని విశ్వసింపుడు; ఈ ప్రపంచమున కతీతముగ, ప్రపంచవాసులనుండి ప్రక్షాళితులూ, పునీతులూ కండు; మీ లక్ష్యములను సకలజన హితార్థమై వ్యవహరింప నిండు; మీ ప్రాపంచిక వ్యామోహమును త్రెంచుకుని, ఉత్తేజసారమై లాఘవమును, సౌకుమార్యమును సంతరించుకొనండి. అటుపై, దృఢసంకల్పముతో, నిర్మలహృదయముతో, సముల్లాసస్ఫూర్తితో, వచోధారాసమన్విత భాషతో, దివ్యసూత్ర ప్రకటనమునకై మీ సమయమును వెచ్చింపవలె, తద్వారా మానవప్రపంచ ఏకత్వము తన మండపమును అమెరికా శిఖరాగ్రముపై నెలకొలుపవచ్చును, ప్రపంచదేశము లన్నియూ దైవవిధానము ననుసరింపవచ్చును. దైవవిధానమనగా సకలజనావళికీ న్యాయము, కృపలే యనునది సునిశ్చయము. ఎందులకనగా, ప్రపంచదేశము లన్నియూ భగవంతుని గొఱ్ఱెలే, భగవంతుడే ప్రేమాస్పదుడైన కాపరి. ఆయన ఈ గొఱ్ఱెలను సృష్టించి, సంరక్షించి, పరిపోషించి, శిక్షణ నొసగినాడు. ఇంతకుమించిన అనంతవాత్సల్య మేమున్నది? భగవంతునకు ప్రస్తుతి, మనము సమస్త జ్ఞానవిహీన వివక్షలనుండీ విముక్తులమై, భగవంతుని గొఱ్ఱె లన్నింటిపట్లనూ కారుణ్యముతో ఉన్నందులకూ; ప్రతి ఒక్కరినీ సేవింపవలె, దయాన్విత పితరునివలె ప్రతి ఒక్కరికీ శిక్షణ నీయవలె ననునది మన పరమావధి అయినందులకూ - దశసహస్ర ధన్యవాదముల ననుక్షణమూ అర్పింపవలె.
మీకు ప్రశంసాభినందనలు!
	 
ఈ రాష్ట్రముల యందలి నగరములకు, గ్రామములకు, కుగ్రామములకు వెడలి, భగవత్సౌరభములను పరివ్యాపన మొనరించుట యందు నిమగ్నతనొందెడు ప్రతి ‌వ్యక్తీ, ప్రతి ఉదయమూ - ఈ వినతిని ధ్యాన పూర్వకముగా పఠింపవలె. 
 
ఓ నా దేవా! ఓ నా దేవా! నీ వాక్కును జనసామాన్యమున ప్రవృద్ధ మొనరించి, నీ జనులయందున నీ బోధనలను పరివ్యాపనము గావింప సంకల్పించి, మహత్తరకార్యమున మగ్నుడనైన నన్ను, నా అల్పత్వమున, అశక్తత యందున వీక్షింపుచున్నాడవు. పవిత్రాత్మ నిశ్వాసముతో నీవు నాకు సాహాయ్యపడకుండినచో, విజయము నొందుటకు నీ సువిఖ్యాత సామ్రాజ్యసేనలతో నాకు తోడుపడకుండినచో, మక్షికమును పక్షీంద్రునిగ, జలబిందువును నదులుగ, సముద్రములుగ, అణువును దీపికలుగ సూర్యులుగ పరివర్తన గావింపగల నీ యనుగ్రహములను నాపై కురియింప నిచో నే నెటుల సాఫల్యత నొందగలను. ఓ నా ప్రభూ! నా జిహ్వ సర్వజనులయందుననూ నీ ప్రస్తుతులను, విశిష్టతలను వచియించునటుల, నీ ప్రేమ, పరిజ్ఞానముల మధువుతో నా మనస్సు ఉప్పొంగునటుల నీ విజయ ప్రదాయక, కార్యసాధకశక్తితో నాకు తోడ్పడు. 
నీవు సర్వశక్తియుతుడవు, నీ ఇచ్ఛానుసార వ్యవహర్తవు.

-`Abdu'l-Bahá
-----------------------

